Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

స్వాములవారిదయ
(శ్రీ అగ్ని హోత్రం రామానుణ తాతాచారి)

శాస్త్రములు దేవుడిని ప్రేమస్వరూపి అని పేర్కొంటున్నది. అటువంటి ప్రేమ స్వరూపమే శివస్వరూపమని తిరుమూలనయనారు వాక్కు. కోపతాపములతో మనం సాధించలేని దానిని, ప్రేమతో ఒక చిటుకలో సాధించవచ్చు. శ్రీకంచి కామకోటిపీఠాన్ని అలంకరించిన చంద్రశేఖరులు అట్టి దయతో కూడిన ప్రేమస్వరూపులు. ఆ ప్రేమ వారి ముఖంలో అణువణువులోనూ వ్యక్త మౌతువుంటుంది. ఆయనమాటలూ చేతలూ ఈ ప్రేమయొక్క ఛాయలే. పెద్దలను చూచినా, పిన్నలను చూచినా, సంపన్నులను చూచినా, దరిద్రులను చూచినా, పండితుడిని చూచినా, పామరుడిని చూచినా, ఆయన ప్రేమస్రవంతిలో ఏమాత్రపు ఒడిదొడుకులుకాని, అసమత్వం కానీ వుండదు.

శ్రీవారికి విసుగులేదు. అలసట లేదు. విరామంలేదు. వారికి ఆర్తత్రాణమే ఒక దీక్ష. 'అభయం సర్వభూతేభ్యః' అనటమే వారి మహావాక్యం.

ఒకరోజు ఈసంఘటన మాంబలంలో జరిగింది. రాత్రి పండ్రెంటుగంటలు. ఆచార్యులవారు నన్ను పిలిపించి చాలసేపు ముచ్చటించినారు. మనగ్రంథంలోని సూక్ష్మతత్త్వములన్నీ, అలవోకగావివరించినారు. కాలంగడిచేది తెలియక, ఆనందంగా వారి సమక్షంలో వారి మాటలవింటూ మైమరచి వుండిపోయాను. ఈవిధంగా సంభాషణ తెల్లవారుఝూము 5 గంటల దాకా సాగింది. తర్వాత స్వాములవారు దండంక మండలువూ రెంటినీ తీసుకొని బయలుదేరినారు. వారు వెళ్ళుతుంటే ధర్మదేవతయే నడచి వెళ్ళుతున్నట్టు అనిపించింది.

త్రోవలో, ఒక స్త్రీ, ఒక యువతిని, చంటిబిడ్డనూ తీసుకొని ఆచార్యులవారి ముందుకు వచ్చినది. రాత్రిఅంతా నిదురమేల్కొని కాలాతీతమైన కాలంలో, శ్రీవారిని దర్శంచడానికీ తనగోడు చెప్పుకోవడానికీ వచ్చిన ఆస్త్రీనిచూచి నాకు కోపం వచ్చింది.

''స్వాములవారికి విశ్రాంతి ఏమీ అవసరంలేదా?'' అని ఆమెతో అన్నాను. ఆమె నామాటను వినిపించుకోలేదు. తనతో వచ్చిన యువతిని నమస్కరించమని చెప్పి, స్వామివారితో మాట్లాడసాగింది. నేను మరలా ఆక్షేపించగా, ''ఉదయం ఏడుగంటలకు ప్రసవించిన తనకుమారై, ఎక్స్‌ప్రెస్‌ బండిలో వెళ్ళుతున్నందున, స్వామివారి ఆశీర్వాదంకోసం తాను వచ్చాననీ, అందుకే శ్రమ ఇస్తున్నానని'' ఆమె నిదానంగా చెప్పింది. నేను కోపంగా మాట్లాడటం. ఆమె పట్టుదలగా నమస్కరించి తనపనిని తాను చూచుకోవటం స్వాములవారు చిరునవ్వుతో చూస్తూవున్నారు. తర్వాత నన్నే ప్రసాదం తెమ్మని, నా ప్రతిబంధం లేకుండా, ఆయన ఏకాంతంగా అనుగ్రహించడానికి దారి చూచుకొన్నారు. నేను ప్రసాదం తెచ్చేలోపుగా ఆమె అన్నీ వివరించింది. స్వాములవారు ఓర్పుతో విన్నారు. ఆమె ప్రశాంతంగా ప్రసాదంఅందుకొని వెళ్ళిపోయింది.

6 -20

ఆమె వెళ్ళిన తర్వాత శ్రీవారు ఇలా అన్నారు. ''భగవంతుని ముందు తమ తమ బాధలను చెప్పుకొంటే బాధానివృత్తి ఔతుందని ప్రజలలో నమ్మకం ఉన్నది. కానీ ప్రజలకు ఈ భగవత్సాన్నిధ్యం దొరకటంలేదు. నాలో ఈసాన్నిధ్యం వున్నదనినమ్మి అమాయకంగా వచ్చి, భగవంతుడికి నివేదించినట్లు తమ బాధలను నివేదించి తృప్తితో వీళ్లంతా వెళ్లుతున్నారు. వారి నమ్మకాన్ని నేనెందుకు చెడగొట్టాలి? నేను ఉండటందేనికి? ప్రజలు తమ బాధలు చెప్పుకొంటే వినడానికేకదా! దానివలన ఈ శరీరానికి శ్రమఐనా, బలంతగ్గినా కొదవలేదు. నన్ను ప్రజలునమస్కరిస్తున్నారంటే దానిలో నాకు గొప్పలేదు. ప్రజలలో ఈ మాత్రమైనా నమ్మకం ఉన్నదే- భగవచ్చింతన ఉన్నదే యని నాకు సంతోషంగావుంది. అందుచేత ఈ కార్యంలో ఎవరూ అడ్డురాకుండుటే మంచిది.''

మరొక్కసారి విళ్ళుపురమునకు సమీపంలో ఉన్న అధిష్ఠానానికి వెళ్ళుతూ మార్గమధ్యంలో దర్శనకోసం వేచియున్న హరిజనులు, ఆడమగ చేతులు జోడించుకొని నిలచుని ఉండగా-చూచి వారిలో పెద్దలైనవారిని పిలిచి కుశల ప్రశ్నలు వేసి అనుగ్రహించారు. భగవంతుడే తమ్ములను అనుగ్రహించినట్లు ఆ అమాయకజనం ఆనందబాష్పాంచితులయ్యారు. అపుడు స్వాములవారు, ''నేను పల్లకిలో వెళ్ళి వుంటే, ఈ జనుల దైవచింతననూ, భక్తినీ ఏలా తెలుసుకోగలను? వీళ్ళందరూ తమ తమ ధర్మాన్ని తాము పాలిస్తూ వుండటం నేను తెలుసుకోడానికే ఈసందర్భం భగవంతుడు అనుగ్రహించినాడు'' అన్నారు.

వేదప్రతిష్ఠాపనంలో ఆచార్యులవారికి అమితమైన శ్రద్ధ. స్వదేశసంస్థానాలు ఉన్నపుడు వేదాధ్యయనపరులకు ఆదరణ ఉండేది. ఇపుడు అది అంతరించిపోయింది. వేదాధ్యయనం ప్రోత్సహించడానికి క్రొత్తగా కొందరికైనా వేదం నేర్పాలని శ్రీవారికి ఆకాంక్ష. వేదాధ్యయనం చేసినవారికి బహూకృతులు ఇవ్వాలని వారి అభిప్రాయం ఒకరోజు ఒక స్త్రీ-సంపన్నురాలు వచ్చి నమస్కరించింది. స్వాములవారు ఆమెను, ''నీవు నాకు నూరుసవరనుల ఇవ్వగలవా? వేదాధ్యయం చేసినవారికి స్వర్ణకుండలాలు ఇవ్వవలెనని అభిప్రాయం. ఏమంటావు''అని అన్నారు. ఆమె తన కంఠంలోవున్న బంగారు గొలుసును వెంటనే తీసి ఇచ్చింది. అంతేకాక రెండువారాలలో నూరు సవరనులు సంపాదించి తెచ్చి ఇచ్చింది.

ఇలయాత్తం గుడిలో స్వాములవారు వున్నపుడు విద్యుత్‌ సదస్సు జరిగింది. మతంలో విశ్వాసం కల్గించటం- కళలను ప్రోత్సహించడం- ఇదీ సదస్సు యొక్క ఉద్దేశం. ఒకరోజు సాయంత్రం 5 గంటలనుండి రాత్రి 12 గంటల వరకు, స్వాములవారు ఈ సదస్సు గూర్చిన ఏర్పాట్లు వివరించసాగినారు. అపుడు ద్రవ్యం గూర్చి ప్రస్తావన వచ్చింది. స్వాముల వారు అన్నారు. ''డబ్బును గూర్చి చింతించటం మనపని కాదు. సదస్సు ఎట్లా నడవటం అనేదే ఇప్పటి ప్రశ్న. దానిని మనం నిర్ణయిస్తే, దానికి కావలసిన ద్రవ్యంమాట చంద్రమౌళీశ్వరుడే చూచుకొంటాడు.''

విద్వత్సదస్సు మహావైభవంగా జరిగింది. ఇలాంటి సదస్సే నారాయణపురంలోనూ జరిగినది. సదస్సు కార్యక్రమం స్వాములవారు నిర్ణయించారు; దానికి కావలసిన ఆర్థికపథకం చంద్రమౌళీశ్వరుడే చూచుకొన్నాడు.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page